సోమవారం నుంచి మలిదశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో జయభేరి మోగించిన భాజపా విజయోత్సాహంతో వస్తుంటే, గత నెలరోజుల వ్యవధిలో వరుసగా బయటపడిన బారీ బ్యాంక్ కుంభకోణాలపై మోడీ సర్కార్ ను గట్టిగా నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి. ఇక విభజన చట్టంలో హామీల అమలుచేయాలని కోరుతూ తెదేపా, వైకాపా, తెరాస ఎంపిలు మోడీ సర్కార్ పై యుద్ధానికి సిద్దం అవుతున్నారు. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే ముందు కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడంతో పార్లమెంటులో ప్రతిపక్షాలు కూడా ఈసారి తెలుగు రాష్ట్రాల ఎంపిలతో గొంతు కలిపి మోడీ సర్కార్ ను గట్టిగా నిలదీసే అవకాశం ఉంది.
ఇక మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని సిబిఐ అరెస్ట్ చేసినందున కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటులో తన విశ్వరూపం చూపించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా తెదేపా, వైకాపా ఎంపిలు రాజీనామాలు చేయడానికి సిద్దం అవుతున్నారు. అది మోడీ సర్కార్ పై ఎటువంటి ప్రభావం చూపదు కానీ ఒత్తిడి పెంచడం ఖాయం. ప్రధాని నరేంద్ర మోడీకి క్లిష్ట సమయాలలో చాలా అండగా నిలిచినా కెసిఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో మోడీ సర్కార్ కు పార్లమెంటులో ఇంత వ్యతిరేక వాతావరణం ఎన్నడూ ఏర్పడలేదని చెప్పవచ్చు.
ఈ నేపధ్యంలో మోడీ సర్కార్ కీలకమైన బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకోవలసి ఉంటుంది. అలాగే అది ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును, బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతున్న ఆర్దికనేరగాళ్ళ ఆస్తులను జప్తు చేయడానికి నిర్దేశించిన బిల్లును, ఓబిసి కమీషన్ కు రాజ్యంగా హోదా కల్పించే ఓబిసి బిల్లును, ఇంకా అనేక ఇతర బిల్లులను ఆమోదించుకోవలసి ఉంటుంది. కనుక ఈ సమావేశాలు మోడీ సర్కార్ కు కత్తిమీద సామువంటివేనని భావించవచ్చు.