కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తన మనసులో మాట బయట పెట్టగానే వివిధ రాష్ట్రాల నేతలు ఆయనకు ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిహేమంత్ సోరెన్ మరికొందరు నేతలు ఫోన్ చేసి కెసిఆర్ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి ఇదే విషయం వారికి తెలియజేసారు. వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “విద్య, వైద్యం, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, రిజర్వేషన్లు వంటివాటిని కేంద్రప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకొని, చిల్లర రాజకీయాలు చేస్తోంది. ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్దం. అటువంటి వాటన్నిటినీ రాష్ట్రాలకు విడిచిపెట్టి కేంద్రం రక్షణ, ఆర్ధిక, విదేశీ వ్యవహారాలు వంటి కొన్ని రంగాలకు పరిమితమైతే సరిపోతుంది. అప్పుడే రాష్ట్రాలు తమ అవసరాలు, జనాభా ఆధారంగా ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగగలవు.
దశాబ్దాలు గడుస్తున్నా దేశ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వస్తే భాజపాకి, భాజపా మీద కోపం వస్తే కాంగ్రెస్ కి ఓటేస్తుంటారు. ఎందుకంటే వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆ ధైర్యంతోనే ఆ రెండు పార్టీలు ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ రాష్ట్రాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆటలు ఆడుతున్నాయి. చైనా, సింగపూర్, జపాన్ వంటి దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే, భారత్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయింది. జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు వస్తే తప్ప ఈ పరిస్థితులు మారవు. కనుక ఆ మార్పు తెలంగాణా రాష్ట్రం నుంచే మొదలుపెడదాము. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త ఆలోచనావిధానాలతో సరికొత్త రాజకీయశక్తిని సృష్టిద్దాము. దేశ రాజకీయాలలో మార్పుకు దశా దిశా నిర్దేశం చేయడానికి నేను సిద్దం. 10 లక్షల కిమీ ప్రయాణం అయినా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే,” అని అన్నారు.