రాజ్యసభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్ధి?

త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధిని నిలబెట్టడానికి సిద్దం అవుతోంది. శాసనసభ సభ్యుల కోటాలో జరుగబోయే ఈ ఎన్నికలలో ఒక్కో అభ్యర్ధికి కనీసం 30 మంది మద్దతు ఉంటేనే గెలుస్తారు. ఆ లెక్కన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మజ్లీస్ ఎమ్మెల్యేలను కలుపుకొంటే తెరాసకు 92 మంది ఉన్నారు. కనుక మూడు సీట్లను తెరాస గెలుచుకోవడం ఖాయమని స్పష్టమవుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీకున్న 14 మందిలో ఏడుగురు తెరాసలో చేరిపోవడంతో ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు. అయినప్పటికీ తెరాసను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణా అమరవీరుల కుటుంబ సభ్యుడిని నిలబెట్టాలని కాంగ్రెస్ నేతలు తెరాసను డిమాండ్ చేస్తున్నారు.

తెరాస ఎలాగూ ఆ పని చేయదు కనుక తామే తెలంగాణా అమరవీరుల కుటుంబ సభ్యుడిని పోటీకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పాటు తెదేపా, వైకాపాల నుంచి తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ నేటికీ ఆయా పార్టీల ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. కనుక ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి, అతను లేదా ఆమెకే ఓటేయాలని విప్ జారీ చేయవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను దిక్కరించితే వారిపై అనర్హత వేటు వేయాలని మళ్ళీ స్పీకర్ కు, ఆయన పట్టించుకోకపోతే ఎన్నికల సంఘానికి లేదా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.