ఆ తెలంగాణ వద్దు: కోదండరామ్

తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ మరోసారి తెలంగాణ సర్కార్ మీద వాడివేడి వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా పర్యటన నుండి తిరిగి వచ్చిన కోదండరామ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే వ్యాఖ్యలు చేయడంతో, అధికారపక్షం సందిగ్దంలో పడింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చిందని, కానీ కాంట్రాక్టర్లు, రియాల్టర్లకు లబ్ధి చేసే తెలంగాణ వద్దని కోదండ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం సంఘటితంగా పని చేస్తామని కోదండరాం అన్నారు.

కోదండరామ్ గతంలోనూ టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు చేశారు. చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని కోదండరాం వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆయన అండగా నిలిచారు.గత రెండేళ్లుగా కేసీఆర్ ప్రభ అప్రతిహతంగా సాగుతోంది. ఎన్నికల్లో నిల్చున్న ప్రతిసారి భారీ మెజారిటీతో అధికారపక్షం నెగ్గుతోంది. ఈ టైంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన కోదండరామ్ లాంటి వ్యక్తి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు సంధించడం ప్రతిపక్షాలకు కాస్త ఊరటనిస్తోంది. గతంలో కోదండరామ్ వ్యాఖ్యల మీద మంత్రులు, టిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మరి ఈ సారి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.