తెలంగాణా పోలీసు శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం తరచూ వినబడుతుంటుంది. దానికి ఆచరణలో చూపించారు మారేడ్ పల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. రోజూలాగే అయన గురువారం ఉదయం ఈస్ట్ మారేడ్ పల్లి జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు చేరుకొన్న ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది. దానిలో మహీంద్రా హిల్స్ జూనియర్ కాలేజికి చెందిన కొందరు విద్యార్ధినులున్నారు. వారందరూ ఇంటర్ పరీక్షలు వ్రాయడానికి తమ పరీక్షా కేంద్రానికి వెళుతున్నారు. కానీ దారిలో బస్సు చెడిపోవడంతో తీవ్రఆందోళన చెందసాగారు. వారితో వచ్చిన కాలేజి వార్డెన్ వారిలో కొందరిని ఆటో రిక్షా మాట్లాడి పంపించింది. కానీ ఇంకా ఎనిమిది మంది విద్యార్ధినులు మిగిలిపోయారు. ఆటోలు దొరకకపోవడంతో పరీక్షలకు హాజరు కాలేమేమోననే భయంతో ఒకరిద్దరు విద్యార్దినులు ఏడ్వసాగారు. అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అది చూసి వారిని తన పోలీస్ వాహనంలో ఎక్కించుకొని సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేర్చారు.
ఆ సమయంలో ఎవరో ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. అటువంటి సమయంలో చొరవ తీసుకొని ఆ బాలికలను తన వాహనంలో సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చినందుకు సోషల్ మీడియాలో ఆయనను ప్రశంశిస్తున్నారు. ఆ సంఘటన గురించి తెలుసుకొన్న అనేకమంది ఆయనకు ఫోన్ చేసి అభినందించసాగారు. పరీక్షా కేంద్రం నిర్వాహకులు, పోలీస్ ఉన్నతాధికారులు కూడా శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.
ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “నేనేదో గొప్ప కార్యం చేశానని అనుకోవడం లేదు. ఆ సమయంలో నేను అక్కడ ఉన్నాను. ఆ విద్యార్ధుల పరిస్థితి అర్ధం చేసుకొని వారిని పరీక్షా కేంద్రాలకు చేర్చాను. అది కూడా నా స్వంత వాహనంలో కాదు. ప్రభుత్వ వాహనంలో. నేను చేసిన ఈ చిన్న సహాయానికి ఇంతమంది గుర్తించి పనికట్టుకొని అభినందిస్తారని నేను ఊహించలేదు. అందరికీ నా కృతజ్ఞతలు,” అని అన్నారు.