2019 ఎన్నికలు: అభివృద్ధి కేరాఫ్ తెరాస సర్కార్?

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి చాలా మర్గాలుంటాయి. అయితే తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని కళ్ళారా చూపించి వచ్చే ఎన్నికలలో బారీ మెజార్టీతో విజయం సాధించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే కొన్ని జిల్లాలలో మంచి నీటి సరఫరా మొదలయింది. మిగిలిన పనులను కూడా పూర్తి చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మంచినీటిని అందించడానికి జోరుగా పనులు సాగుతున్నాయి.

ఇక ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా మొదలైంది. ఎకరానికి రూ.4,000 చొప్పున  రైతులకు పంట పెట్టుబడిని ఈ ఏడాది మే, నవంబర్ నెలలలో అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి వచ్చే ఎన్నికలలోగా పొలాలకు నీళ్ళు అందించి చూపాలని ఆ శాఖ అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి సమాంతరంగా మిషన్ కాకతీయ పధకం క్రింద చెరువులలో పూడికతీత పనులు కూడా వర్షాకాలం నాటికి పూర్తిచేసి పొలాలకు నీటిని అందించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. కనుక ఈసారి బడ్జెట్ లో వ్యవసాయం, సాగునీటి రంగాలకు బారీగా నిధులు కేటాయించే అవకాశం ఉండవచ్చు. 

ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేయాలనుకొన్న మేజర్ ప్రాజెక్టులు

ఇవికాక అత్యంత ప్రాధాన్యతగా చేపట్టిన ఎస్.ఆర్.ఎస్.పి-2, కల్వకుర్తి, భీమ, నెట్టంపాడు మొదలైన ప్రాజెక్టులను పూర్తిచేసి, డిసెంబర్ లోగా నీటిని విడుదల చేసి రైతులను ప్రసన్నం చేసుకోవాలని తెరాస సర్కార్ భావిస్తోంది. పైన పేర్కొన్న వివిధ ప్రాజెక్టులన్నిటినీ ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేసి చూపగలిగితే, వచ్చే ఎన్నికలలో ఇక తెరాసకు ఎదురు ఉండకపోవచ్చు.