బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎల్. రమణ అధ్యక్షతన తెదేపా పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణా తెదేపా ముఖ్యనేతలు అందరూ హాజరయ్యారు. కానీ పాలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకాలేదు. ఆయనకు ఆహ్వానం పంపలేదని కొందరు, పంపినా రాలేదని మరికొందరు చెప్పారు. అయితే పార్టీలో అందరికంటే తానే సీనియర్ నని, అందరూ తన మాటే వినాలని చెప్పే మోత్కుపల్లి నరసింహులు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం వెనుక బలమైన కారణం కనిపిస్తోంది.
ఇక గవర్నర్ పదవి లభించదని తెలిసిన తరువాత అయన మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయినప్పుడు, తెదేపా-తెరాస-భాజపాలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటే మంచిదని సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డికి అనవసరమైన ప్రాధాన్యత నిచ్చి చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేశారని అన్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెదేపాను తెరాసలో విలీనం చేసేస్తే మంచిదని అన్నారు. అయన చేసిన వ్యాఖ్యలపై టిటిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయనకు తెరాసలోకి వెళ్ళే ఉద్దేశ్యం ఉన్నట్లయితే హాయిగా వెళ్ళవచ్చని కానీ తెదేపాను తెరాసలో విలీనం చేస్తామని చెప్పవద్దని టిటిడిపి నేతలు గట్టిగా హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండానే అయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో చేజేతులా పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించుకొన్నారు. బహుశః చంద్రబాబు నాయుడు కూడా ఆయనపై ఆగ్రహంగానే ఉండి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఆ సమావేశానికి హాజరుకాకపోవడమే మంచిదని మోత్కుపల్లి నరసింహులు భావించి ఉండవచ్చు. కానీ అది కూడా తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఆయనకు తెదేపాలో కొనసాగే ఉద్దేశ్యం లేదు కనుకనే పోలిట్ బ్యూరో సభ్యుడై ఉండి ఆ సమావేశానికి డుమ్మా కొట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు మూడున్నరేళ్ళ తరువాత రాజకీయాలలోకి రీ-ఎంట్రీ ఇస్తున్నప్పుడు కాస్త ఆలోచించుకొని మాట్లాడి ఉంటే, ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా? ఇప్పుడు తెదేపాలో ఇమడలేక తెరాస నుంచి ఆహ్వానం రాకపోతే మోత్కుపల్లి నరసింహులు పరిస్థితి ఏమిటి?