అలా చేస్తే నా స్థాయిని తగ్గించుకోవడమే: జానారెడ్డి

బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి మంత్రి కేటిఆర్ ‘జానాబాబా 40 దొంగల ముఠా’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత కే. జానారెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. “కొందరు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఆవిధంగా చేస్తే తమ స్థాయి పెరుగుతుందనే భ్రమలో ఉన్నారు. అటువంటివారు చేసే వ్యాఖ్యలపై స్పందిస్తే నా స్థాయి నేనే తగ్గించుకొన్నట్లవుతుంది. కనుక అయన (కేటిఆర్) వ్యాఖ్యలపై నేను స్పందించదలచుకోలేదు. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన ఆవిధంగా మాట్లాడటం తగదని మాత్రం చెపుతున్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేశానో తెలుసుకోకుండా మాట్లాడుతున్నవారికి సంజాయిషీ చెప్పుకోవడం అనవసరం. నేను ఎప్పుడూ సంస్కారవంతమైన రాజకీయాలే చేశాను. మా పార్టీలో వారిని, మా ప్రత్యర్ధులను కూడా ఆవిధంగా ఉండాలని చెపుతుంటాను. అలాగే రాజకీయాలలో నైతిక విలువలను కూడా ఎప్పుడూ పాటించాలి. నేను పార్టీ మారినప్పుడు నా పదవికి రాజీనామా చేసే మారాను. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఫిరాయింపులను గట్టిగా వ్యతిరేకించేవాడిని. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే గెలిచి అధికారంలోకి రావడం తధ్యం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తెరాస పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని చెప్పగలను,” అన్నారు జానారెడ్డి.