అయ్యో! ఎంతపని చేశావమ్మా!

కాలేజీ జీవితం ఒక అందమైన, మధురమైన కల. కాలేజీ గడప దాటి బయటి ప్రపంచంలో అడుగుపెట్టినప్పటి నుంచి యువతీయువకులకు నిత్యం అగ్నిపరీక్షలే. ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తే సంతోషమే..కానీ చాలా మందికి ఆ సంతోషం దక్కదు. ఉద్యోగాల కోసం కోచింగ్ లు, ప్రవేశ పరీక్షలకు హాజరవుతుండటం..వాటి ఫీజుల కోసం తల్లితండ్రులను డబ్బు అడగవలసిరావడం...ఆర్ధిక సమస్యలు..తత్ఫలితంగా నానాటికీ పెరిగిపోయే ఒత్తిడి..వాటన్నిటినీ తట్టుకొంటూ ప్రవేశపరీక్షలకు, ఇంటర్వ్యూలకు హాజరవుతూ తమను తాము నిరూపించుకొనే ప్రయత్నాలు చేయవలసిరావడం...ఇలాగ అదొక అంతులేని కధలాగ సాగిపోతుంటుంది. వీటన్నటినీ తట్టుకొని ఉద్యోగం సంపాదించుకోవాదం సామాన్యమైన విషయం కాదు. ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేని సుప్రజ వంటి నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడి అర్ధాంతరంగా జీవితం ముగించి కన్నవారికీ తీరని శోకం మిగిల్చి వెళ్ళిపోతుంటారు.

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డికి చెందిన జాప సుప్రజ (24) కూడా అందరు యువతీయువకులలాగే చక్కగా చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగప్రయత్నాలు మొదలుపెట్టింది. టి.అర్.టి. పరీక్షలకు హాజరయ్యింది. కానీ ఆ పరీక్షలలో సరిగ్గా వ్రాయలేకపోయింది. కనుక ఇక తనకు ఉద్యోగం రాదనే దిగులుతో తీవ్రమనస్తపానికి గురై బుధవారం సాయంత్రం  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. 

ఆమె వ్రాసిన సూసైడ్ నోట్ ఆమె మనసులో ఎంత ఆందోళన చెందుతోందో అద్దం పట్టింది. తన తల్లి తండ్రులు తనను ఎంతో కష్టపడి చదివించారని, వారు తనపై పెట్టుకొన్న ఆశలు నిలపాలని టీ.ఆర్.టి.పరీక్షలకు చాలా కష్టపడి చదివానని, కానీ పరీక్షలలో సరిగ్గా వ్రాయలేకపోయానని ఆ లేఖలో పేర్కొంది. ఉపాద్యాయ వృత్తి తప్ప మరొకటి చేయలేని తనకు ఇక ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు కనుక ఈ నిర్ణయం తీసుకొంటున్నట్లు వ్రాసింది. తనకంటే చిన్నవారు ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించుకోనో లేక పెళ్ళిళ్ళు చేసుకొనో సంతోషంగా జీవితం గడుపుతున్నారని కానీ తాను ఎంత కష్టపడి చదివి పరీక్షలు వ్రాసిన కనీసం ఉద్యోగం సంపాదించుకోలేని స్థితిలో తల్లితండ్రులకు భారంగా మిగిలిపోయానని సుప్రజ ఆవేదన వ్యక్తం చేసింది. జీవితంలో అన్ని విధాల వైఫల్యం చెందిన తనకు బ్రతికే హక్కు అవకాశం లేవని కనుక ఆత్మహత్య చేసుకొంటున్నానని వ్రాసింది. తనకు కనీసం ఉరి ఎలా వేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొంటున్నానని లేఖలో వ్రాసింది. తల్లి తండ్రులకు ఇంకా భారంగా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఆత్మహత్య చేసుకొంటున్నట్లు వ్రాసింది. తల్లితండ్రుల ఆశలు వమ్ము చేసిన తనను క్షమించమని లేఖలో వారిని ప్రార్ధించి అర్ధాంతరంగా జీవితం ముగించింది.