సింగరేణి కార్మికులకు శుభవార్త

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు హైకోర్టు, సుప్రీం కోర్టు అంగీకరించనందున వాటి స్థానంలో తెలంగాణా ప్రభుత్వం ప్రతిపాదించిన కారుణ్య నియామకాలను అమలుచేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. కారుణ్య నియామకాల కోసం వైద్యపరమైన అనుమతుల కోసం మార్చి మొదటి వారం నుంచి సింగరేణి మెడికల్ బోర్డుకు అర్హులైన కార్మికులు  దరఖాస్తు చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఆరోగ్యకారణాల చేత వైద్యపరమైన అనుమతులతో జరుపబోయే కారుణ్య నియామకాల పట్ల న్యాయస్థానాలు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చునని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

 సింగరేణిలో కొందరు అధికారులు లంచాలు మరిగినట్లు తనకు నిఘావర్గాల ద్వారా సమాచారం అందిందని, అటువంటివారిని కార్మికులు కూడా ఉపేక్షించవద్దని, లంచం అడిగినవారిని చెప్పుతో కొట్టమని, వారికి తాను అండగా నిలబడతానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. సింగరేణి ఆసుపత్రులలో ఈ లంచాల బెడద చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని త్వరలోనే వారి స్థానంలో ఉస్మానియా, గాంధీ, నీమ్స్ ఆసుపత్రుల వైద్యులను నియమిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.