ఇప్పుడు తెరాస సర్కార్ ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు తమ హయంలో ఏనాడూ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే కనీసం జిల్లా సమస్యలనైనా పరిష్కరించడానికి ఆసక్తి చూపలేదు. ఆ కారణంగా అది ఎప్పుడూ వెనుకబడిన జిల్లాగానే మిగిలిపోయింది. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత అదిలాబాద్ తో సహా రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు వాటి అవసరాలు, సమస్యలు, వనరులకు అనుగుణంగా నిధులు, ప్రాజెక్టులు కేటాయిస్తుండటంతో ప్రతీ జిల్లాలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుండటం ప్రజలు కూడా చూస్తున్నారు. కనుక ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది చాలా శుభపరిణామమే.
ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు ద్వారా రాగల ఆరు నెలలలో 70,000 ఎకరాలకు నీళ్ళు అందించబోతున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పధకం క్రింద జిల్లాలో చెరువుల అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆ చెరువుల క్రింద 20,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని చెప్పారు. ఆదిలాబాద్ పట్టణ శివార్లలో మినీ విమానాశ్రయం నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు.
కడెం ప్రాజెక్టు: రూ. 870 కోట్లు, సాత్నాల ప్రాజెక్టు: రూ.28 కోట్లు, భోద్ నియోజకవర్గంలో గోముత్రి రిజర్వాయర్: రూ.210 కోట్లు, అదిలాబాద్ పట్టణం అభివృద్ధికి: రూ.85 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.
కొరటా బ్యారేజి క్రింద ముంపుకు గురవుతున్న కొరటా గ్రామస్తుల కోసం 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారు. స్థానిక ప్రజల అభ్యర్ధన మేరకు గ్రామ శివారులో శివాలయం నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.