మరికాసేపటిలో ముంబై చేరుకోనున్న శ్రీదేవి భౌతికకాయం

ప్రముఖనటి శ్రీదేవి మృతిపై దుబాయి పోలీసులు దర్యాప్తు జరిపి, అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా నిర్దారించి ఆ కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆమె భౌతికకాయాన్ని ముంబై తరలించడానికి వీలుపడింది. ఈరోజు సాయంత్రమే దుబాయి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయాన్ని వెంటబెట్టుకొని ఆమె భర్త బోనీకపూర్, కుమారుడు అర్జున్ కపూర్ తదితరులు బయలుదేరారు. ఆ విమానం ఈరోజు రాత్రి 10 గంటలకు ముంబైలోని చత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకోవచ్చునని సమాచారం. 

అక్కడి నుంచి ఆమె శరీరాన్ని నేరుగా అంధేరీలోని ఆమె నివాసానికి తరలించనున్నారు. ఆమె భౌతికకాయాన్ని బుదవారం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం స్థానిక సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచుతారు. అనంతరం విల్లేపార్లేలోని సేవాసమాజ్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.