హైదరాబాద్ మెట్రో అప్-డేట్స్

హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ కొన్ని పిర్యాదులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి 1. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం. 2. మెట్రో రైళ్ళు నత్తనడకలతో మెల్లగా సాగుతుండటం. 3. స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడం. 4.రోజూ ప్రయాణించేవారికి మంత్లీ పాసులు జారీ చేయకపోవడం.

వీటిలో టికెట్ ధరలు తగ్గించే అవకాశం లేదనే చెప్పవచ్చు. కనుక మరింత పెంచకుండా ఉంటేచాలని కోరుకొని సర్దుకుపోకతప్పదు. ఇక మెట్రో రైళ్ళకు ట్రాఫిక్ అవరోధాలు ఉండవు కనుక ప్రయాణికులు వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకోవడం సహజమే. కానీ మెట్రో రైళ్ళు చాలా మెల్లగా సాగుతూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కనుక వాటిలో ప్రయాణించడం కంటే స్వంత వాహనం లేదా ఆటో, క్యాబ్, ఆర్టీసి బస్సులలోనో ప్రయాణించడమే మేలని చాలా మంది భావిస్తున్నారు. పైగా మెట్రోతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే గమ్యస్థానాలు చేరుకోగలుగుతుండటంతో నేటికీ చాలా మంది వాటికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతోంది కనుక ఆ సమస్య తీరినట్లే. 

ఇటీవల మంత్రి కేటిఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమావేశమయినప్పుడు ఈ సమస్యలన్నిటిపై వారితో చర్చించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైల్ సర్వీసులను పెంచాలని కోరారు. అయన సూచనల మేరకు త్వరలోనే మెట్రో రైల్ సర్వీసులను, వేగాన్ని పెంచుతామని, అలాగే మంత్లీ పాసులు కూడా జారీ చేయిస్తామని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. దీనిపై ఎల్&టి సంస్థతో మాట్లాడుతున్నామని తెలిపారు.