కాంగ్రెస్, భాజపా దొందూ దొందే: కెసిఆర్

కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సోమవారం జరిగిన తెలంగాణా రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహనా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ (యూపియే), భాజపా (ఎన్డియే) ప్రభుత్వాలను కడిగిపడేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, భాజపాలు దేశంలో వ్యవసాయ రంగాన్ని దానిపైనే ఆధారపడున్న రైతుల పరిస్థితులను పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. దేశ అవసరాలకు సరిపడినంత నీటిని అందించగలిగిన నదులు మనకున్నప్పటికీ, కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం వలన ఒకపక్క వేలాది టిఎంసిల నీరు వృధా అవుతుంటే మరోపక్క పంటలకు నీళ్ళు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంగా, బ్రహ్మపుత్ర తదితర జీవనదులలో 70,000 టిఎంసిల నీళ్ళు పారుతున్నప్పటికీ దానిలో 40 శాతం నీటినైనా ఉపయోగించుకోలేకపోతున్నామని అదే చైనా సర్కార్ ఆ దేశంలో ఉత్తరాది ప్రాంతాలకు నీటిని అందించడానికి ఏకంగా 1500 కిమీ కాలువలు నిర్మించుకొందని కెసిఆర్ గుర్తుచేశారు.      

రూ.24 లక్షల కోట్ల కేంద్రబడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కనీసం రూ.2 లక్షల కోట్లు మోడీ సర్కార్ కేటాయించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలనే ఆలోచన చేయడం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కర్ణాటక శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి కనుక గోదావరి, కావేరీ నదుల అనుసంధానం చేస్తామంటూ మోడీ సర్కార్ కొత్త డ్రామా మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు.  

జాతీయ ఉపాధి హామీని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయమని ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి, వ్యవసాయమంత్రి రాదా మోహన్, కేంద్రంలో సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇదే వేదికపై నుంచి దానికోసం తీర్మానం చేసి పంపిద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.                

దేశాన్ని 70సం.లు పాలించిన కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాల అసమర్ధ, తెలివితక్కువ, రైతు వ్యతిరేక విధానాల వలననే నేడు యావత్ దేశంలో రైతులు అష్టకష్టాలుపడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కానీ, కాంగ్రెస్, భాజపాలు రెండూ నేటికీ కూడా వారి కష్టాలను గుర్తించడంలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. దేశంలో రైతులలలో సహనం నశిస్తోందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు దేశంలో రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయమని, వారికి తెలంగాణా రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించినా ఆశ్చర్యం లేదని అన్నారు. దేశంలో రైతు విప్లవానికి తెలంగాణా రాష్ట్రమే నాంది పలుకబోతోందని కెసిఆర్ అన్నారు.