నేడు కరీంనగర్ లో పర్యటించనున్న సిఎం కెసిఆర్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణా రైతు సమన్వయ సమితుల సభ్యులతో నిన్న రాజేంద్రనగర్‌లోని జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మరికొన్ని జిల్లాల సమితి సభ్యులతో సమావేశం కానున్నారు. ఉదయం 10.40 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని వీటి ఏర్పాటుకు గల కారణాలను, విధివిధానాలను వివరించి వీటిపై రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. అనంతరం తీగలగుట్టలో తన నివాసానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

మంగళవారం ఉదయం హెలికాఫ్టర్ లో అంతర్గాం మండలంలోని మ్రుమూరు చేరుకొని అక్కడ ఎత్తిపోతల పధకానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత చనఖా కోరాట బ్యారేజి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో అదిలాబాద్ చేరుకొని డైట్ మైదానంలో తెరాస ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ లోని ప్రభుత్వ అతిధిగృహానికి చేరుకొంటారు. అక్కడా సింగరేణి కార్మిక సంఘాల నేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనులను ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 6.00 గంటలకు హెలికాఫ్టర్ లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.