
తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత సెంటిమెంటలో అందరికి తెలుసు. ఆయన చేసే ప్రతి పనిని ముహూర్తాలు చూసి చేస్తుంటారు. జాతకాలను బాగా నమ్మే కేసీఆర్ ఆచారాలను, సంఖ్యలను బాగా నమ్ముతారు. అందుకే ఆయత ఛండీయాగాన్ని ఎంత ఖర్చు చేసైనా సరే ఘనంగా నిర్వహించారు. ముందు నుండి కూడా ఇలాంటి వాటి మీద ఎంతో పట్టువిడుపుగా ఉండే కేసీఆర్, తాజాగా అతి పెద్ద జెండా విషయంలోనూ అలాగే చేశారు. జెండాకు సంబంధించిన అన్ని అంశాల్లో తొమ్మిది సంఖ్య వచ్చేటట్లు జాగ్రత్తపడ్డారు. మరి అలాంటి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నెంబర్ 6. ఆయన చాలా వరకు 6 నెంబర్ ను ప్రిఫర్ చేస్తారు. దాని ప్రకారం జిల్లాల ఏర్పాటులో కూడా ఇలాంటి నెంబర్ వచ్చేటట్లు జాగ్రత్తపడుతున్నారని వాదన వినిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన ముసాయిదాలో 23 జిల్లాలను అనుకున్నారు. కానీ అందులోని సంఖ్యలు 2, 3లను కలిపితే 5 వస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం 23 సంఖ్య కేసీఆర్ కు కలిసిరాదని భావిస్తున్నట్లు సమాచారం. దాంతో సిరిసిల్లను ఓ జిల్లాగా కలుపుతూ 24 జిల్లాలుగా తెలంగాణను మార్చేలా సిద్దపడుతున్నారట. 24లోని 2, 4 కలిపితే 6 వస్తుంది కాబట్టి, అది కేసీఆర్ కు  కలిసివస్తుంది, పైగా సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టే ఆ రకంగా కూడా కలిసివస్తుందని పెద్ద స్కెచ్ వేశారట.