
తెలంగాణలో కొత్తగా జిల్లాల ఏర్పాటు మీద చర్యలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని పూర్తి చెయ్యాలనే టార్గెట్ తో కేసీఆర్ రంగంలోకి దిగారు. కొత్త జిల్లాల ఏర్పాటు మీద రేమండ్ పీటర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటయింది. ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో వచ్చే సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎన్ని జిల్లాలు ఏర్పాటవుతాయి అన్న దానిపై క్లారిటీ లేదు కాని 23 లేదా 24 జిల్లాల ఏర్పాటు కావచ్చు అని తెలుస్తోంది.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ అతి పెద్ద జిల్లాగా ఉంది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మాత్రం ఆదిలాబాద్ జిల్లా నుండి కొత్తగా ఏర్పడే కొమరంభీం జిల్లా అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. అలాగే మండలాల పరంగా వరంగల్ జిల్లా అతి పెద్ద జిల్లాగా మారనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఎంతో కీలకమైన ఉద్యోగుల విభజన పై సిఎస్ రాజీవ్ శర్మ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రెండు జిల్లాలుగా ఏర్పాటుచేస్తే ఉద్యోగుల కొరత ఉండదు. కానీ అంతకు మించి మూడు లేదా నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేస్తే ఉద్యోగుల కొరత ఏర్పడనుంది. అందుకు ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేస్తోంది. పైగా కొత్త జిల్లాల పరిపాలన కోసం కొత్త పాలనా భవనాల వేట సాగుతోంది. తొందరలోనే కొత్త జిల్లాల ఏర్పాటు మీద సిఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.