తెరాస అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని తెరాస వాగ్దానం చేసింది. తెరాస అధికారంలోకి వచ్చి నేటికి 44 నెలలు పూర్తయ్యాయి. త్వరలో నాలుగేళ్ళు కూడా పూర్తవుతాయి. మరో ఏడాదిలోగానే ఎన్నికలు వచ్చేస్తాయి. కానీ ఇంతవరకు ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు. చాలా వరకు ఇంకా శంఖుస్థాపన దశలోనే ఉన్నాయి. మంత్రి కేటిఆర్ శనివారం మారేడ్ పల్లిలో గాంధీనగర్ బస్తీలో 536 ఇండ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తుండటమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంలో అనేకానేక సమస్యలు, అవరోధాలు ఎదురవుతున్నందున ప్రతీ అడుగు కష్టమే అవుతోంది. కనుక వాటి నిర్మాణంలో ఆలస్యం జరగడం సహజమే. రాబోయే ఎన్నికలలోగా హైదరాబాద్ లో లక్ష ఇళ్ళతో కలిపి రాష్ట్రంలో మొత్తం 2.60 లక్షల ఇళ్ళు నిర్మించి చూపుతామని మంత్రి కేటిఆర్ చెప్పారు. ఈ ఇళ్ళ స్థలాల కోసం నగరంలో వివిధప్రాంతాలలో గల బస్తీలలో ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. ఈ పరిస్థితులలో వచ్చే ఎన్నికల నాటికి కనీసం లక్ష ఇళ్ళయినా నిర్మించి అందించగలదో లేదో అనుమానమే.
మారేడ్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 536 ఇళ్ళకు, సిఖ్ విలేజిలోని గాంధీనగర్ లో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 176 ఇళ్ళకు మంత్రి కేటిఆర్ శనివారం శంఖుస్థాపన చేయబోతున్నారు.