హైదరాబాద్ లోనే కాదు, జిల్లాల్లో కూడా పరిశ్రమలు - కెటీఆర్

హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, పరిశ్రమలు గ్రామాలకు కూడా విస్తరింపజేయాలని, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈరోజు పరిశ్రమలశాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన, అనంతరం మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో ఇసుక కొరత ఉండడం వల్ల, దాని బదులుగా రాక్‌శాండ్‌ వినియోగించాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రశంసిస్తున్నారని, ఇతర రాష్ట్రాల వారు, తమ పారిశ్రామిక విధానం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. టీఎస్‌ఐపాస్‌ ఆకర్షణీయమైన విధానమని చెబుతూ, పరిశ్రమల స్థాపన అనుమతులకు ఇక పై రోజులు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని, విధానం సులభతరం చేశామని, ఉపాధి కల్పనే ప్రధాన ధ్యేయంగా పరిశ్రమలను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు.

గనులశాఖ కార్మికుల సంక్షేమానికి పథకాలు తెస్తున్నట్లు వివరించారు. మైనింగ్‌శాఖలో 2015-16లో 2,772 కోట్లు ఆర్జించినట్లు తెలిపిన కేటీఆర్‌, 2016-17 నాలుగు వేల కోట్లు లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.