కామారెడ్డిలో తొలి మంకీపాక్స్ కేసు

July 25, 2022
img

భారత్‌లో ఇప్పటివరకు కేరళ, ఢిల్లీలలో కలిపి నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదు కాగా కామారెడ్డిలో మరో కేసు నమోదయ్యింది. ఇటీవల కువైట్ నుంచి వచ్చిన 40 ఏళ్ళ వ్యక్తికి జ్వరం ఒంటిపై దద్దుర్లు రావడంతో పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం కోసం వెళ్ళగా మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. వెంటనే వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ వ్యక్తిని హుటాహుటిన అంబులెన్సులో హైదరాబాద్‌ ఫీవర్ హాస్పిటల్‌కు తరలించి అక్కడ మంకీపాక్స్ రోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో చేర్పించారు. ఫీవర్ హాస్పిటల్‌ను మంకీపాక్స్ వ్యాధి చికిత్సకు నోడల్ హాస్పిటల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యులు అతని రక్తం, మూత్రం, కురుపుల నుంచి స్రావాలను సేకరించి పరీక్షలకు పంపారు. 

ఆ వ్యక్తి కువైట్ నుంచి వచ్చిన తరువాత రెండు వారాలపాటు కామారెడ్డి పట్టణంలో తన కుటుంబ సభ్యులతో ఉన్నారు. ఇంకా పలువురు బంధుమిత్రులను కలిసి ఉంటారు. బహిరంగ ప్రదేశాలలో తిరిగి ఉంటారు. కనుక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ముందుగా అతని కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచి, గత రెండువారాలలో తాను ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు?అనే వివరాలను సేకరిస్తున్నారు. 

కామారెడ్డి పట్టణంతో సహా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే తక్షణం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ 90302 27324 నంబరుకి వాట్స్అప్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని లేదా 040 24651119 నంబరుకి ఫోన్ చేయాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

Related Post