భారత్‌లో మళ్ళీ 20వేలకు చేరిన రోజువారీ కరోనా కేసులు

July 14, 2022
img

భారత్‌లో పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరోవైపు మళ్ళీ కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతోంది. మళ్ళీ ఆరు నెలల తరువాత దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటడంతో పాజిటివిటీ రేటు 5.10 శాతంగా నమోదైంది. 

భారత్‌లో బుదవారం 3.94 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 20,139 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.36 లక్షలకు చేరుకొంది. అయితే నిన్న ఒక్కరోజే 16,482 మంది కరోనా నుంచి కోలుకొనడంతో రికవరీ రేటు 98.49 శాతం నమోదు కావడం చాలా ఉపశమనం కలిగించే విషయం. 

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 199 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బుదవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 13.44 లక్షల మంది టీకాలు వేసుకొన్నారని తెలిపింది. కరోనా ఉదృతి మళ్ళీ పెరుగుతుండటంతో రెండో డోసు-బూస్టర్ డోసుకు మద్య గడువును 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించిన కేంద్రప్రభుత్వం, ఈ నెల 15తేదీ నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా బూస్టర్ డోస్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. 

కరోనా మళ్ళీ శరవేగంగా వ్యాపిస్తున్నందున తెలంగాణలో ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, టీకాలు వేయించుకోవాలని ప్రజారోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కరోనాను అధిగమించినప్పటికీ సీజనల్ జ్వరాలు పెరిగే అవకాశం ఉంది కనుక అందరూ తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్ జిఎస్ రావు విజ్ఞప్తి చేశారు.

Related Post