త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

May 11, 2022
img

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి బుధవారం రంగారెడ్డి జిల్లాలో నార్సింగిలో టీ-డయాగ్నొస్టిక్ హబ్‌ను, దానికి సంబంధించి మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు. త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖలో 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రకటించారు.   

ఈ టీ-డయాగ్నొస్టిక్ సెంటర్లలో రక్తం, మలమూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకో, మెమోగ్ర‌ఫీ మోదలైన  57 రకాల పరీక్షలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని, రాబోయే రోజుల్లో 137 రకాల పరీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.  ఈ వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను మొబైల్ యాప్‌లో చూసుకునే వీలు ఉంటుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.   

“బస్తీలలో ఉండే నిరుపేదలు వైద్య చికిత్సలు పరీక్షల కోసం జిల్లా కేంద్రాలలో ఆస్పత్రులకు, హైద‌రాబాద్‌, సికిందరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళడం కష్టం అవుతుంది కనుక సిఎం కేసీఆర్ ఎక్కడికక్కడ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాటు చేస్తాము. రాష్ట్రంలో  పేద ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాసుపత్రులలోనే ఉచితంగా మూత్ర పిండాల జబ్బులకు, మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషనలు చేయించుకోవచ్చు. హైద‌రాబాద్‌ నగరం నలువైపులా నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తోంది. మన ప్రభుత్వం ప్రజారోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తోంది, “ అని మంత్రి హరీష్ రావు అన్నారు. 

Related Post