తెలంగాణలో నేటి నుంచి జ్వర సర్వే: మంత్రి హరీష్‌

January 21, 2022
img

కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేటి నుంచి జ్వర సర్వే ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సర్వేలో ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ, పురపాలక సిబ్బంది, అధికారులు పాల్గొంటారని మంత్రి హరీష్ తెలిపారు. వారు ఇంటింటికీ వెళ్ళి ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో అడిగి తెలుసుకొంటారని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్లు గుర్తిస్తే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తారని, అవసరమైతే దవాఖానాలకు తీసుకువెళ్లి చేర్పిస్తారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సర్వే సందర్భంగా వారు ప్రజలకు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారని చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తపడి ఒక కోటి హోమ్ ఐసోలేషన్ కిట్స్, రెండు కోట్ల టెస్టింగ్ కిట్స్ సిద్దం చేసుకొని ఉందని తెలిపారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న ముందు జాగ్రత్త చర్యలు, అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం కూడా ప్రశంసించిందని తెలిపారు. ప్రజలు కూడా కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, తప్పనిసరిగా రెండు డోసులు కరోనా టీకాలు వేసుకోవాలని, అర్హులైనవారు బూస్టర్ డోస్‌ టీకాలు వేసుకోవాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.  

Related Post