ఆరు నెలలకే బూస్టర్ డోస్‌ ఇవ్వాలి: హరీష్ లేఖ

January 19, 2022
img

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో ప్రజలు మళ్ళీ కరోనా టీకా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ళు పైబడినవారికి, దీర్గకాలిక వ్యాధులున్నవారికి మళ్ళీ బూస్టర్ డోస్‌ (3వ డోస్‌) టీకాలు వేస్తున్నప్పటికీ, రెండో డోస్‌ తీసుకొన్న 9 నెలల తరువాతే బూస్టర్ డోస్‌ ఇవ్వాలనే నిబందనతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ విషయం తెలియక చాలామంది కరోనా టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఓ పక్క కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటంతో బూస్టర్ డోస్‌కు దొరక్క తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు డబ్బులు చెల్లించి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అనధికారికంగా టీకాలు వేయించుకొంటున్నారు. దీని వలన బూస్టర్ డోస్‌ లెక్కలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. 

కనుక రెండో డోస్‌-బూస్టర్ డోస్‌ మద్య ఈ 9 నెలల గడువును 6 నెలలకు తగ్గించాలని, అలాగే వయసుతో సంబందం లేకుండా రెండో డోస్‌ వేసుకొన్నవారందరికీ కూడా బూస్టర్ డోస్‌ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కేంద్రానికి లేఖ వ్రాశారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకి మూడు నెలలకే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు వీలవుతుందేమో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి టీకాలు వేసుకోవడం చాలా అవసరం కనుక దీనిపై కేంద్రప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీతో సహా దేశంలో పలు రాష్ట్రాలు కూడా బూస్టర్ డోస్‌ గడువును 6 నెలలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. కనుక త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చు.

Related Post