దక్షిణాఫ్రికా నుంచి 185 మంది హైదరాబాద్‌కు!

November 29, 2021
img

భారత్‌కు నిత్యం వేలాదిమంది విదేశాల నుంచి వచ్చిపోతుంటారు. ఇప్పుడు వారి రాకపోకలు కూడా ఓ వార్తగా మారడం విశేషం. కరోనా కొత్త రూపం ఒమిక్రాన్‌ వైరస్ మళ్ళీ ప్రపంచదేశాలలో శరవేగంగా వ్యాపిస్తుండటంతో విదేశీ ప్రయాణికుల ద్వారా అది కరోనాలాగే భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. కనుక కేంద్రప్రభుత్వం దీని కొరకు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ అంతకంటే ముందు అంటే గత మూడు రోజులలో ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న దేశాల నుంచి భారత్‌కు చాలా మందే వచ్చారు. వారిలో 2,168 మంది హైదరాబాద్‌కు వచ్చారు. యూకే నుంచి అత్యధికంగా 1,717 మంది, దక్షిణాఫ్రికా నుంచి 185 మంది, న్యూజిలాండ్‌ నుంచి 108, యూరోపియన్ దేశాల నుంచి 102 మంది హైదరాబాద్‌ వచ్చారు. బోట్స్ వానా నుంచి 16,జింబాబ్వే 11, బ్రెజిల్ 10, చైనా 9, బంగ్లాదేశ్ 8, మారిషస్ 2 మంది హైదరాబాద్‌కు వచ్చారు.  

అయితే ఇప్పటికే ఒమిక్రాన్‌ గురించి భారత్‌లో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయినందున విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన 2,168 మందికి శంషాబాద్‌ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని ఇసోలేషన్ కేంద్రాలకు తరలించి వారి రక్త నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు.

Related Post