భారత్‌ సాధించింది...వంద కోట్లు వాక్సినేషన్

October 21, 2021
img

ఏడాది క్రితం భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పుడు ‘భారత్‌ పరిస్థితి ఏమిటి...కరోనా దెబ్బకు దేశం కుప్పకూలిపోతుందా?’ అని ప్రపంచవ్యాప్తంగా సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఒక్క ఏడాది కూడా పూర్తికాక మునుపే దేశీయంగా టీకాలు తయారుచేసుకొని, వాటిని యుద్ధ ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసి దేశంలో దాదాపు 50 శాతం మందికి టీకాలు వేసి చూపించి విమర్శకుల నోళ్ళు మూయించింది. 

టీకాల పంపిణీ, వాటిని వేయడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తొలుత కొన్ని తప్పటడుగులు వేసినప్పటికీ, ఆ తరువాత ఆ సమస్యలను, లోపాలను అన్నిటినీ అధిగమించి కేవలం 279 రోజులలో వంద కోట్లు వాక్సినేషన్ మైలురాయిని భారత్‌ అధిగమించాయి. ప్రపంచంలో చైనా తరువాత ఈ స్థాయిలో కరోనా టీకాలు వేసిన దేశంగా భారత్‌ నిలిచింది. ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరులోగా దేశంలో 94.4 కోట్ల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకొని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.        

ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన సమాచారం ప్రకారం ఈ 10 నెలల్లో  దేశంలో 18 ఏళ్ళకు పైబడినవారిలో 75 శాతం మంది ఒక డోస్‌ టీకాలు వేసుకోగా 31 శాతం మంది రెండు డోసులు వేసుకొన్నారు. ఇక వాక్సినేషన్ ప్రక్రియలో హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా జమ్ముకశ్మీర్‌, కేరళ, ఉత్తరాఖండ్, గుజరాత్‌ రాష్ట్రాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. ఏపీ 13వ స్థానంలో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి. 

ఏపీలో 77 శాతం మంది మొదటి డోస్‌ తీసుకోగా, 43.8 శాతం మంది రెండు డోసులు తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 75 శాతం మంది మొదటి డోస్‌ తీసుకోగా, కేవలం 29.6  శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకొన్నారు.

తెలంగాణలో ఇంకా 69 లక్షల మంది ఇప్పటివరకూ ఒక్క డోస్ కూడా తీసుకోలేదు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇక టీకాలు వేసుకోవలసిన అవసరం లేదనే భావన ప్రజలలో పెరిగిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రజలందరూ విధిగా రెండు డోసులు టీకాలు వేసుకోవాలని, అపోహలతో అలసత్వం ప్రదర్శించవద్దని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విజ్ఞప్తి చేశారు. 

     


Related Post