తెలంగాణలో పదిహేను రోజుల్లో కోటి మందికి టీకాలు

September 16, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల కరోనా టీకాలు వేశారు. నేటి నుంచి రాబోయే 15 రోజులలోగా మరో కోటి మందికి టీకాలు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతారు. రోజుకి కనీసం 6-7 లక్షల మందికి టీకాలు వేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. పరిశ్రమలు, కార్యాలయాలు, ఐ‌టి కంపెనీలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, బస్టాండ్లు, కాలేజీలు, మురికివాడలు వగైరాల వద్ద మొబైల్ వాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరికీ టీకాలు వేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. 10-15 మంది ఉద్యోగులున్న కంపెనీలు, సంస్థలు స్థానిక టీకా కేంద్రాలకు ఫోన్‌ చేసినట్లయితే సిబ్బంది వారి వద్దకే వచ్చి ఉచితంగా టీకాలు వేస్తారు. 

ఈ టీకాలు, టేకా కేంద్రాల గురించి పట్టణాలలో ప్రసార మాధ్యమాల ద్వారా, గ్రామాలలో చాటింపులు వేసి ప్రచారం చేస్తారు. ఈ 15 రోజుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పట్టణాలు, గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు ప్రతీ ఇంటికీ వెళ్ళి టీకాలు వేసుకొన్నారో లేదో అడిగి తెలుసుకొంటారు. ఒకవేళ టీకాలు వేసుకోనివారున్నట్లు గుర్తిస్తే వెంటనే వారిని సమీపంలోని టీకా కేంద్రానికి తీసుకువెళ్లి టీకాలు వేయిస్తారు. టీకాలు వేసుకొంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎవరికైనా అపోహలున్నట్లయితే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి టీకాలు వేయిస్తారు. ఇంట్లో అందరూ టీకాలు వేయించుకొన్నట్లు దృవీకరించుకొన్నాక ‘ఈ ఇంట్లో అందరూ టీకాలు వేయించుకొన్నారు’ అని తెలియజేసే స్టికర్లు అంటిస్తారు. 

ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తయిన తరువాత 12-18 ఏళ్ళు వయసున్న 48 లక్షల మంది బాలబాలికలకు టీకాలు వేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 

Related Post