హైదరాబాద్‌ జూలో సింహాలకు కరోనా!

May 05, 2021
img

భారత్‌లో ఇప్పటికే రోజుకి సుమారు మూడున్నర లక్షల మంది కరోనా బారిపడుతున్నారు. ఈ సమస్య నుంచి ఏవిదంగా బయటపడాలో తెలియక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకొని దిక్కులు చూస్తుండగా, తాజాగా జంతువులకి కూడా కరోనా వైరస్ సోకుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయమే. 

హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కులో ఒకేసారి 8 సింహాలకు కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా వాటిలో కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో జూ అధికారులకు అనుమానం వచ్చి గత నెల 24న వాటి రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. వాటన్నిటికీ కరోనా సోకినట్లు నివేదిక వచ్చింది. దీంతో వాటిని మిగిలిన జంతువులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వాటి ఆరోగ్యం బాగానే ఉందని జూ అధికారులు తెలిపారు. 

జూకి వచ్చే సందర్శకుల ద్వారా వాటికి కరోనా సోకిందా లేదా జూ సిబ్బంది ద్వారా సోకిందా లేదా మాంసం ద్వారా కరోనా సోకిందా అనే విషయం తెలుసుకొనేందుకు జూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా జూ మూసేసి సందర్శకులను నిలిపివేశారు.

Related Post