సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 17 వరకు, కాలేజీలకు 16 వరకు ప్రకటించింది.
కనుక సెలవుల తర్వాత కాలేజీలు 17 నుంచి, పాఠశాలలు 18 నుంచి పునః ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డ్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. సంక్రాంతి సెలవులలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు రహస్యంగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.
ఈ నెల 12వ తేదీ ఆదివారం పడింది. 13న భోగీ, 14న సంక్రాంతి, 15న కనుమ, 16న ముక్కనుమ పండుగలు జరుగుతాయి. కనుక జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
సంక్రాంతి పండుగకు టిజిఎస్ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడిపించబోతోంది. ఈ నెల 10,11,12 తేదీలలో ఊళ్ళకు వెళ్ళేందుకు, పండగ తర్వాత మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు 19,20 తేదీలలో ఈ ప్రత్యేక బస్సులు నడిపించబోతోంది.
సంక్రాంతి పండుగ సమయంలో సిటీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఎప్పటిలాగే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.