నారాయణపేటలో 21 మంది విద్యార్ధులకు అస్వస్థత

November 26, 2024
img

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్ధులు అస్వస్థులవుతున్నారు. వారిలో కొంతమంది విద్యార్ధులు చనిపోతున్నారు కూడా. ఈ సమస్యపై బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. 

తాజాగా నారాయణ పేట జిల్లా, మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 21 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరు రోజుల క్రితం ఇదే పాఠశాలలో మద్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్ధులు ఆస్పత్రి పాలయ్యారు. 

వారు పూర్తిగా కొలుకోక మునుపే మళ్ళీ 21 మంది విద్యార్ధులు ఆస్పత్రి పాలవడంతో సిఎం రేవంత్ రెడ్డి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ని ఆదేశించగా ఆయన ఆదేశం మేరకు డీఈవో  నర్సింహ రెడ్డి విచారణ జరిపి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈ వో మురళీధర్ రెడ్డి, భోజనశాల ఇన్‌చార్జి బాపురెడ్డిలను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న ఏజన్సీని రద్దు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. 

Related Post