తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో మొదలైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ మేఘా రూ.200 కోట్లు, ఆదానీ సంస్థ రూ.100 కోట్లు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే యూనివర్సిటీ భవన సముదాయాల డిజైన్ వగైరా అన్నీ సిద్దంగా ఉన్నాయి. నవంబర్ 6 నుంచి నిర్మాణ పనులు ప్రారంభించి 10 నెలల్లోగా పూర్తిచేసి శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
దీని కోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్ పేట్ వద్ద 57 ఎకరాలు కేటాయించింది. ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి దీని భూమిపూజ కూడా చేశారు. ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో వివిద పరిశ్రమల అవసరాలకు తగిన 17 రకాల కోర్సులు ఉంటాయి.
ఈ యూనివర్సిటీలో ఏడాదికి 6,000 మంది విద్యార్దులు చొప్పున ప్రవేశాలు ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్న ఈ యూనివర్సిటీ ప్రాంగంలోనే అధ్యాపకులు, సిబ్బంది ఇళ్ళు, విద్యార్దులకు వసతి గృహాలు నిర్మించబోతున్నారు. ఈ యూనివర్సిటీని ప్రధాన భవనాలను మేఘా కంపెనీయే నిర్మించబోతోంది.
యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్దులకు పరిశ్రమలలో ఉద్యోగాలకు తగిన శిక్షణ పొందుతారు కనుక వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు పరిశ్రమలు సిద్దంగా ఉన్నాయి.