దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలలో బీటెక్ ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ జారీ అయ్యింది. జనవరి 22 నుంచి మొదటి విడత, ఏప్రిల్ 1 నుంచి రెండో విడత మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీలో 24,000కి పైగా బీటెక్ సీట్లు ఉండగా, ట్రిపుల్ ఐటీలలో 8,500 సీట్లున్నాయి. వాటిలో ప్రవేశాల కొరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మెయిన్‌లో ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్ పరీక్షలు వ్రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షకు ఈ నెల 28 నుంచి నవంబర్ 22వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షకు మూడు రోజులు ముందు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 22 నుంచి 31 వరకు తొలివిడత పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 12లోగా ఫలితాలు ప్రకటిస్తారు.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షకు మూడు రోజులు ముందు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించి ఏప్రిల్ 17లోగా ఫలితాలు ప్రకటిస్తారు.