ఏటా వినాయక చవితితో పండుగల సీజన్ మొదలయ్యి దీపావళి వరకు కొనసాగుతుంది. గణేశ్ ఉత్సవాలు ముగిసిన కొద్ది రోజులకు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ పండుగ పూర్తవగానే దసరా ఉత్సవాలు మొదలవుతాయి.
ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన మొదలయ్యి 11వ తేదీన దుర్గాష్టమినాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా (విజయ దశమి) పండుగ పడింది. కనుక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ప్రకటించింది.
అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని, మళ్ళీ అక్టోబర్ 15వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలియజేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.