తెలంగాణ విద్యా కమీషన్‌ ఏర్పాటుకి జీవో జారీ

September 04, 2024
img

తెలంగాణ రాష్ట్రంలో ప్రీ-ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి, భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా విద్యాభోదన చేసేందుకుగాను విధివిధానాలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమీషన్‌ ఏర్పాటు చేస్తోంది. రెండేళ్ళ కాలపరిమితిగల ఈ కమీషన్‌కు ఛైర్మన్‌గా ఓ ఐఏఎస్ అధికారిని, ముగ్గురు సభ్యులను నియమించనుంది. ఈ కమీషన్‌కు సచివాలయంలో లేదా ప్రజా భవన్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 

కమీషన్‌ విధులు: 

• విద్యావ్యవస్థలో లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తుండటం. 

• ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో కొత్తగా చేయాల్సిన మార్పులు, చేర్పులు సూచించడం. 

• విద్యా భోధన, పాఠ్యాంశాలను మెరుగు పరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం. 

• ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు సాధించేందుకు విద్యా వ్యవస్థలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అమలుచేయించడం వంటి పలు అంశాలు ఉన్నాయి. 

వీటి కోసం విద్యా కమీషన్‌కు విస్తృతమైన అధికారాలు, పరిధి కల్పించి అవసరమైన నిధులు ప్రభుత్వం అందించబోతోంది.

Related Post