తెలంగాణలో 65 ఐటిఐల అప్‌గ్రేడ్ మంచి నిర్ణయమే

June 19, 2024
img

అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. అలాగని అందరూ ఇంజనీరింగ్ చేసేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అయిపోలేరు. కనుక వివిద కారణాల చేత ఉన్నత చదువులు చదవలేని యువతకి ప్రత్యామ్నాయంగా వివిద రంగాలలో సాంకేతిక శిక్షణ ఇచ్చే ఐ‌టిఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి.

కానీ వాటిలో కూడా కొన్ని నిర్ధిష్టమైన కోర్సులే ఉంటున్నాయి తప్ప ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వలన పుట్టుకొస్తున్న కొత్త కొత్త ఉద్యోగావకాశాలకు సరిపడే శిక్షణ లభించడం లేదు.

ఈ సమస్యని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం రూ.2,324కోట్లు వ్యయంతో రాష్ట్రంలో 65 ఐ‌టిఐలను ‘అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్’ (ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. 

దీనిలో భాగంగా సిఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐ‌టిఐలో ఏటీసీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్దులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎప్పటికప్పుడు అందివస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే అనేక ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తెలంగాణ సాధనలో ఉద్యోగాలు కూడా ఓ అంశం. కానీ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు కల్పించే ఐ‌టిఐలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

కానీ మా ప్రభుత్వం ఐ‌టిఐల ప్రాధాన్యతని గుర్తించింది కనుక ఒక్కో ఐ‌టిఐపై రూ.50 కోట్లు ఖర్చు చేసి ఏటీసీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాము. వీటిలో శిక్షణ పొందినవారు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు సంపాదించుకునేలా అన్ని రంగాలలో శిక్షణ కల్పిస్తాము. ఈ ఏటీసీలకు సంబందించి అన్ని వ్యవహారాలను నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటాను,” అని చెప్పారు. 

Related Post