తెలంగాణలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీకి సిద్దంగా ఉంచిన, పంపిణీ చేసిన 24 లక్షల తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంటోంది. వాటి మొదటి పేజీలో ముందు మాటలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ మంత్రుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం.
ప్రభుత్వం మారినప్పుడు అవి కూడా తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం అధికారులు అది పట్టించుకోకుండా మళ్ళీ కొత్త పుస్తకాలు ముద్రింపజేసి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈవిషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ముందుగా పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారిని, ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డిని ఆ పదవులలో నుంచి తొలగించి వారి స్థానంలో వేరేవారిని నియమించింది.
వెనక్కు తీసుకున్న పాఠ్య పుస్తకాలలో మొదటి పేజీని చించి వేసి యధాతధంగా పంపిణీ చేద్దామనుకుంటే ఆ పేజీ రెండో వైపు జాతీయగీతం, ప్రతిజ్ఞ ఉన్నాయి. అవి లేకుండా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడం సరికాదని భావించిన ప్రభుత్వం మొత్తం 24 లక్షల పుస్తకాలను వెనక్కు తీసుకుంది.
అన్ని పుస్తకాలకు మొదటిపేజీపై స్టిక్కర్ అంటించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్దులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను కూడా వెనక్కు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీదేవసేన డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు.