తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో బడికి బయలుదేరుతున్న పిల్లలతో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి.
ఏటా ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్ధుల సంఖ్య తగ్గుతుండటం లేదా 5వ తరగతి తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కి మారిపోతుండటంతో, ఇకపై పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి, సకాలంలో పాఠ్య పుస్తకాలు, యూనిఫారంలు అందించి, విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది.
రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది విద్యార్ధులు ఉండగా వారిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈసారి ఆ సంఖ్యని మరింతగా పెంచేందుకు ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల అధ్వర్యంలో బడిబాట, విద్యార్దుల తల్లితండ్రులతో సమావేశాలు వగైరా నిర్వహించింది. తల్లితండ్రులు చేసిన సూచనలు, సలహాలను డీఈవోలు విద్యాశాఖకు తెలియజేసి తదనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా 5 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు బాగోలేవని లేదా మరింత మెరుగైన చదువుల కోసం తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో జేర్పిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తోంది.