గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం టిఎస్‌పీఎస్సీ జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో టిఎస్‌పీఎస్సీ సవాలు చేయగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సింగిల్ బెంచ్ తీర్పునే సమర్ధించింది.
సరైన నియమ నిబందనలు పాటించకుండా ప్రిలిమ్స్ నిర్వహించిన్నట్లు రుజువైంది కనుక ఆ పరీక్షలను రద్దు చేయడం సబబే అని డివిజనల్ బెంచ్ నేడు తీర్పు చెప్పింది. దీంతో టిఎస్‌పీఎస్సీకి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు టిఎస్‌పీఎస్సీ ముందు రెండే రెండు మార్గాలున్నాయి. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడం లేదా హైకోర్టు తీర్పుని శిరసావహించి మళ్ళీ ప్రిలిమ్స్ నిర్వహించడం.
మొదటిసారి 2022, అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు ప్రశ్నాపత్రం ముందే లీక్ అయినందున టిఎస్‌పీఎస్సీ ఆ పరీక్షను రద్దు చేసింది. మళ్ళీ రెండోసారి 2023, జూన్ 11న ప్రశ్నాపత్రం లీక్ కాకుండా టిఎస్‌పీఎస్సీ అన్ని జాగ్రత్తలు తీసుకొంది కానీ బయోమెట్రిక్ ద్వారా అభ్యర్ధుల వేలిముద్రలు తీసుకొని సరిచూసుకోకుండా పరీక్షలు నిర్వహించినందుకు మరోసారి పరీక్షలు రద్దు అయ్యాయి.
వరుసగా రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దు కావడం వలన ఈ పరీక్షకు హాజరైన 2,32,457 మంది అభ్యర్ధుల శ్రమ, విలువైన సమయం అన్నీ వృధా అయిపోయాయి. ఈ పరీక్ష బాగా వ్రాయని అభ్యర్ధులకు ఇది మరో గొప్ప అవకాశం కావచ్చు. కానీ పరీక్ష బాగా వ్రాసి తప్పకుండా ఉత్తీర్ణులవుతామని ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు పరీక్ష రద్దు చాలా బాధాకరమే. టిఎస్‌పీఎస్సీ వైఫల్యాలకు లక్షలమంది అభ్యర్ధులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.