తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంతగా గతంలో ఎప్పుడూ అవాంతరాలు ఎదుర్కొలేదు. అనేక అవరోధాలను అధిగమించి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభిస్తే మళ్ళీ మల్టీ జోన్-2లో బ్రేక్ పడింది. దీనిపై నమోదైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మల్టీ జోన్-2లో మాత్రం బదిలీలు, పదోన్నతులపై స్టే విధించింది. దీంతో 13 జిల్లాలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
అయితే మల్టీ జోన్-1 పరిధిలో 20 జిల్లాలలో ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో అక్కడ మాత్రం యాధావిధిగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది.
విద్యాశాఖ జారీ చేసిన పదోన్నతులు, సీనియారిటీ జాబితాపై రంగారెడ్డి జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుని ఆశ్రయించడంతో మల్టీ జోన్-2 పరిధిలోని 13 జిల్లాలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వీటిపై వచ్చే నెల 10వరకు హైకోర్టు స్టే విధించడంతో అప్పటి వరకు విద్యాశాఖ అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది.
హైకోర్టు ఆదేశం మేరకు వీలైనంత త్వరగా ఈ 13 జిల్లాలలో మళ్ళీ కొత్త సీనియారిటీ జాబితాలను తయారుచేసి కోర్టుకు సమర్పించి మళ్ళీ ఈ ప్రక్రియ మొదలయ్యేలా చేస్తామని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు.