నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూర్‌బా పాఠశాలలో మంగళవారం రాత్రి భోజనం తిన్న 100 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న అర్దరాత్రి నుంచి విద్యార్ధినులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు కూడా చేసుకొంటుండటంతో పాఠశాల సిబ్బంది వెంటనే పాఠశాల ఇన్‌చార్జ్ శోభకు ఈవిషయం తెలియజేశారు. ఆమె వెంటనే నాలుగు వాహానాలు ఏర్పాటు చేసి విద్యార్ధినులను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తక్షణమే చికిత్స అందించడంతో విద్యార్ధినులందరూ కోలుకొంటున్నారు.
ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి విచారణకు ఆదేశించారు. విద్యార్ధినులకు నిన్న రాత్రి వడ్డించిన ఆహార పదార్ధాల సాంపుల్స్, విద్యార్ధినులు తాగే నీటి శాంపిల్స్ అధికారులు సేకరించి పరీక్షల కొరకు ల్యాబ్‌కు పంపారు. వాటి నివేదికలను బట్టి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మున్సిపల్ కమీషనర్ చెప్పారు.