తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం సిఎం కేసీఆర్ ఇంతకాలం జమ్మిచెట్టుపై దాచిపెట్టిన అస్త్రశస్త్రాలన్నిటినీ ఒకటొకటిగా కిందకు దింపి అటు ప్రతిపక్షాలపై ఇటు ఓటర్లపై కూడా ప్రయోగిస్తున్నారు. బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తర్వాత ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయబోతుండటం గమనిస్తే ఇది ఎన్నికల కోసమే ప్రత్యేకంగా దాచిపెట్టిన అస్త్రమని అర్దమవుతూనే ఉంది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరో రెండు రోజులలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామని గురువారం ప్రకటించారు. పాఠశాల విద్యా విభాగంలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాలలో 1,523 టీచర్ పోస్టులు కలిపి మొత్తం 6,500 పోస్టుల భర్తీకీ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ పోస్టులను కూడా టిఎస్‌పీఎస్సీ ద్వారానే పరీక్షలు నిర్వహింపజేసి భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే టిఎస్‌పీఎస్సీ ద్వారా వేలాది పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడి భర్తీ ప్రక్రియ వివిద దశలలో కొనసాగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడగానే 6,500 పోస్టుల భర్తీ ప్రక్రియ చకాచకా పూర్తయిపోదని అందరికీ తెలుసు. అన్నీ సజావుగా సాగినా 2024 మార్చి నాటికి ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందో లేదో తెలీదు కానీ ఎన్నికల ప్రచారంలో ఈ డీఎస్సీ నోటిఫికేషన్ గురించి చెప్పుకొని ప్రజలను ఓట్లు అడిగే వెసులుబాటు బిఆర్ఎస్ కల్పించుకొందని భావించవచ్చు. అందుకే ఇది ఎన్నికల కోసమే దాచుకొన్న అస్త్రమని భావించాల్సి వస్తోంది.