తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు!

March 17, 2023
img

ప్రశ్నాపత్రాల లీక్ అయినందున టిఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టిఎస్‌పీఎస్సీ ఈరోజు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను మళ్ళీ ఈ ఏడాది జూన్ 11వ తేదీన నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు జరిపి సిట్‌ ఇచ్చిన నివేదిక ఆదారంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కారణంగా త్వరలో జరుగబోయే మరికొన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

టిఎస్‌పీఎస్సీలో చిన్నగా మొదలైన ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో పోరాటాలు మొదలుపెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. 

ఈరోజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, మరోవైపు బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ ఈ వ్యవహారంపై దీక్షలు, చేస్తుండటంతో టిఎస్‌పీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. లక్డీకపూల్ వద్ద బీఎస్పీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న  ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా బీఎస్పీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. దాంతో ఇరువర్గాల మద్య తోపులాటలు జరిగి స్వల్ప ఘర్షణలు జరిగాయి. పోలీసులు ఆయనతో పాటు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి, కాసేపు తర్వాత ఆయనను ఇంటి వద్ద విడిచిపెట్టారు. 

అయితే తాను ఇంటి వద్దే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నానని చెపుతూ, ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అధికార బిఆర్ఎస్‌కు చెందినవారే ఉన్నారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నానని వరుస ట్వీట్స్ చేశారు. బండి సంజయ్‌ని, బిజెపి కార్యకర్తలని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

Related Post