ఛైర్మన్‌ సంజాయిషీలతో టిఎస్‌పీఎస్సీ అప్రదిష్ట తొలగిపోతుందా?

March 15, 2023
img

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ సంస్థకు, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా తీరని అప్రదిష్ట కలిగించిందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందుకే టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డి మంగళవారం ప్రెస్‌మీట్‌ పెట్టి ఈ వ్యవహారంపై మీడియా ద్వారా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. 

ఆయన ఏమన్నారంటే, “టిఎస్‌పీఎస్సీలో నమ్మినవాళ్ళే మమ్మల్ని మోసం చేసి ప్రశ్నాపత్రాలను దొంగిలించారు. కీలకమైన సమాచారం ఉన్న కంప్యూటర్లపై పని చేసేందుకు అనుమతి కలిగిన  అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌ కుమార్‌ డబ్బుకు ఆశపడి, సంస్థలో ఆరేళ్ళ నుంచి అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి అనే నెట్‌వర్క్ నిపుణుడితో కలిసి కంప్యూటర్ల నుంచి ప్రశ్నాపత్రాలను దొంగిలించి అమ్ముకొనే ప్రయత్నం చేశారు. 

ప్రవీణ్‌ కుమార్‌ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వ్రాయడం దానిలో అతనికి 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమే. నా పిల్లలు కూడా ఈ పరీక్షలు వ్రాసిన్నట్లు మీడియాలో వస్తున్న పుకార్లను ఖండిస్తున్నాను. నా పిల్లలు ఎవరూ ఈ పరీక్షలు వ్రాయలేదు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి టిఎస్‌పీఎస్సీ ద్వారా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశాము. ప్రస్తుతం మరో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ ఏనాడూ ఇటువంటి సమస్యలు తలెట్టలేదు. ఆరోపణలు ఎదుర్కోలేదు. దేశంలోకెల్ల అత్యుత్తమైన విధానాలతో టిఎస్‌పీఎస్సీ పనిచేస్తోంది. కానీ ఇప్పుడు ఇటువంటి దురదృష్టఘటన జరగడం మాకు కూడా చాలా బాధ కలిగిస్తోంది. ఈ కేసుతో సంబందం ఉన్న ఐదుగురునీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాం. న్యాయనిపుణులను సంప్రదించిన తర్వాత టౌన్ ప్లానింగ్, వెటర్నరీ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొంటాము. గ్రూప్-1 మెయిన్స్ మాత్రం యధావిధిగా జూన్ 5నే నిర్వహిస్తాము,” అని చెప్పారు.


Related Post