టిఎస్‌పీఎస్సీలో ఈ లీకులు ఏమిటో?

March 14, 2023
img

టిఎస్‌పీఎస్సీ అధ్వర్యంలో వేలాది ఉద్యోగాలు భర్తీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం అన్ని పరీక్షలు సజావుగానే పూర్తయ్యాయి. కానీ టౌన్ ప్లానింగ్, వెటర్నరీ డాక్టర్స్ పరీక్షాపత్రాలు లీక్ అవడంతో కలకలం మొదలైంది. వెంటనే రంగంలో దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి టిఎస్‌పీఎస్సీ కార్యదర్శికి పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుక, అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డితో సహా పలువురిని అరెస్ట్ చేసి వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. 

టౌన్ ప్లానింగ్, వెటర్నరీ డాక్టర్స్ పరీక్షాపత్రాలు లీక్ అయ్యిన్నట్లు మొదట భావించినప్పటికీ, ఏఈ పరీక్షా పత్రాలు లీక్ అయిన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.  ఉద్యోగాల భర్తీలో అత్యంత కీలకపాత్ర పోషించే టిఎస్‌పీఎస్సీలో కంప్యూటర్లకు పటిష్టమైన సైబర్ భద్రత, సొంత సర్వర్ లేవని కనుగొన్నారు. అందుకే నిందితులు కంప్యూటర్ హ్యాక్ చేసి దానిలో ఓ ఫోల్డరులో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను తమ కంప్యూటర్, హార్డ్ డిస్కులలోకి సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఫిభ్రవరి 25 లేదా 28వ తేదీన నిందితులు ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొన్నట్లు గుర్తించారు. 

దీనితోపాటు భవిష్యత్‌లో నిర్వహించబోయే పరీక్షల ప్రశ్నాపత్రాలను కూడా కొన్నిటిని దొంగిలించిన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొన్నారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈలోగా నిందితుల విచారణ పూర్తయితే, ఫోరెన్సిక్ నివేదిక కూడా చేతికి వస్తే ఏ ఏ పరీక్షల ప్రశ్నాపత్రాలను దొంగతనం చేశారనే దానిపై స్పష్టత వస్తుంది. 

ఏఈ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన్నట్లు తేలడంతో ఈరోజు టిఎస్‌పీఎస్సీ బోర్డు మెంబర్స్ అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమస్యపై చర్చించిన తర్వాత న్యాయనిపుణుల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకోవచ్చు. టిఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు లక్షలాది మంది నిరుద్యోగ యువత హాజరవుతున్నారు. కనుక ప్రశ్నాపత్రాలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించి ఉండాలి. కానీ కొందరు నిందితులు కలిసి టిఎస్‌పీఎస్సీ కంప్యూటర్లను హ్యాక్ చేసి సులువుగా ప్రశ్నాపత్రాలను దొంగిలించడం దిగ్బ్రాంతి కలిగిస్తోంది.            


Related Post