ఇంటర్ పరీక్షలు సర్వం సిద్దం... విద్యార్థులూ మీరు సిద్దమేనా?

March 09, 2023
img

ఈనెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగబోతున్నాయి. కనుక ఇంటర్ బోర్డ్ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఈ ఏడాది ఇంటర్ ప్రధమ, ద్వితీయ కలిపి మొత్తం 9,06,402 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. వారిలో ఇంటర్ ప్రధమ 4,82,501 కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,23,901 మంది ఉన్నారు. వీరుకాక మరో 53,162 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించని కారణంగా పరీక్షలకు హాజరుకాలేనివారున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల సెక్షన్ 144 (కర్ఫ్యూ) అమలులో ఉంటుందని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. అన్ని పరీక్షాకేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి నిఘాలోనే ప్రశ్నాపత్రాలను తెరిచి విద్యార్థులకు అందజేస్తారు. వాటి నిఘాలోనే విద్యార్థులు పరీక్షలు వ్రాయవలసి ఉంటుంది. 

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బోర్డు తరపున పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కనుక ఇక విద్యార్థులే సిద్దం కావలసి ఉంది. 

ఈ పరీక్షల తర్వాత వారు ఉన్నతవిద్యలకు వెళతారు కనుక మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు విద్యార్థులు గట్టిగా కృషి చేయడం చాలా అవసరం. ఒకవేళ ఏ కారణం చేతైనా మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా నిరాశతో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో చదువు అనేది ఒక భాగం మాత్రమే అని గ్రహించి మరో ప్రయత్నం చేయాలి లేదా మరో మార్గంలో ముందుకు సాగడం మంచిది. 

Related Post