గ్రూప్-4 ఉద్యోగాలకి తొమ్మిదిన్నర లక్షల మంది దరఖాస్తు!

February 04, 2023
img

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐ‌టి కంపెనీలు, ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నా నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో గ్రూప్-4 ఉద్యోగాలకి వచ్చిన దరఖాస్తులు తెలియజేస్తున్నాయి. గ్రూప్-4లో 8,180 పోస్టులకు శుక్రవారం సాయంత్రం గడువు ముగిసేలోగా 9,51,321 దరఖాస్తు చేసుకొన్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించిది. అంటే ఒక్కో పోస్టుకి 116 మంది చొప్పున పోటీ పడుతున్నారన్న మాట! 

అయితే 2018లో వెలువడిన నోటిఫికేషన్‌తో పోలిస్తే ఇవి చాలా తక్కువే. అప్పుడు 700 వీఆర్‌వో పోస్టులకి టిఎస్‌పీఎస్సీ వ్రాత పరీక్ష నిర్వహిస్తే ఏకంగా 10.58 లక్షల మంది పోటీ పడ్డారు. అంటే అప్పుడు ఒక్కో పోస్టుకి సగటున 1511 మంది పోటీ పడ్డారన్న మాట! ఈ గ్రూప్-4 ఉద్యోగాలలో 581 సంక్షేమ హాస్టల్స్ అధికారుల పోస్టులకి 1,45,358 మంది దరఖాస్తు చేసుకొన్నారు. గ్రూప్-4 ఉద్యోగాలకి జూలై 1వ తేదీన వ్రాత పరీక్ష జరుగబోతోంది. 

2018తో పోలిస్తే ఈసారి ఈసారి పోస్టులు ఎక్కువే ఉన్నాయి. పోటీ తక్కువగానే ఉంది. కనుక అభ్యర్ధులు గట్టిగా ప్రయత్నిస్తే ఈసారి గ్రూప్-4 ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఎక్కువున్నాయి. 

ఈసారి ఖాళీగా ఉన్న 8,180 పోస్టులు భర్తీ చేస్తే మళ్ళీ ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ ఉండదు. పైగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. కనుక మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఎప్పుడు వెలువడతాయో కూడా తెలీదు. కనుక ప్రభుత్వోద్యోగాలు సాధించాలని ప్రయత్నిస్తున్న నిరుద్యోగులందరికీ ఇదే చివరి అవకాశంగా భావించవచ్చు. 

Related Post