తెలంగాణ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి శుభవార్త!

January 24, 2023
img

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకి, ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పింది. ప్రభుత్వోద్యోగులకి ప్రస్తుతం 17.29% డీఏ చెల్లిస్తుండగా దానిని 20.02 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఉద్యోగులకి, పెన్షనర్లకి కూడా 2.73% డీఏని పెంచుతూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం జీవోలు జారీ చేశారు. దీనిని ఈ నెల జీతాలు, పెన్షన్లతో కలిపి ఫిభ్రవరి నెలలో అందించబోతున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

ఇదేగాక 2021 నుంచి అంటే గత 18 నెలల డీఏ బకాయిలని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో జమా చేయబోతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగులకి 10% ప్రాన్‌ ఖాతాలో జమా చేసి, మిగిలిన 90% సొమ్ముని 8 వాయిదాలలో నగదు రూపంలో అందజేయబడుతుంది. పెన్షనర్లకి కూడా 18 నెలల డీఏ బకాయిలని 8 వాయిదాలలో చెల్లిస్తుంది.

ఈ డీఏ పెంపు, బకాయిల చెల్లింపుతో రాష్ట్రంలో 4.40 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకి, 2.88 లక్షల మంది పెన్షనర్లకి లబ్ది కలుగబోతోంది. డీఏ పెంచి బకాయిలు విడుదల చేస్తున్నందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేసి, రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావుకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకి సంబందించి షెడ్యూల్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 28 నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, మార్చి 4న బదిలీలు, జాబితాని ప్రకటిస్తుంది. మార్చి 5 నుంచి 19వరకు వాటిపై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, 15 రోజులలోగా పరిష్కరిస్తుంది. ఉపాధ్యాయులు తాము ఎంపిక చేసుకొని బదిలీ పొందిన పాఠశాలలో వేసవి సెలవులు తర్వాత నుంచి విధులకి హాజరుకావలసి ఉంటుంది.

Related Post