వంద శాతం ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులపై చర్యలు: సంగారెడ్డి కలెక్టర్‌

January 16, 2023
img

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఏ శరత్‌ మీద జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నెల 12వ తేదీన జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపల్స్, కొందరు ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్‌ సమావేశమయ్యి, ఈసారి పదో తరగతి పరీక్షలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని, అలాగే మంచి గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ (జీపీఏ) సాధించడానికి అందరూ గట్టిగా కృషి చేయాలని కోరారు. అందుకు వారందరూ అంగీకారం తెలిపారు. యధాశక్తిన ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

కానీ హామీ ఇవ్వడం కాదని అందరూ వంద ఉత్తీర్ణత,  మంచి జీపీఏ సాధిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఒకవేళ ఆ ఫలితాలు సాధించకుంటే దానికి తామే బాధ్యులుగా భావించి తమపై చర్యలు తీసుకోవవచ్చునని దానిలో పేర్కొనాలని కలెక్టర్‌ శరత్ ఆదేశించడంతో ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి.

టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు నాగారం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో పాఠశాలలో అనేక సమస్యలున్నాయి. అయినప్పటికీ మేము విద్యార్థులని చక్కగా తీర్చిదిద్దుతూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాము. కానీ ఏ సమస్యలని పట్టించుకోకుండా మంచి ఉత్తీర్ణత సాధించాలని ఒత్తిడి చేయడం, దాని కోసం మమ్మల్ని ఈవిదంగా బెదిరించడం సరికాదు. కనుక జిల్లా కలెక్టర్‌ తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నట్లు ప్రకటించాలి,” అని అన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు హైదరాబాద్‌ వెళ్ళి విద్యాశాఖ ఉన్నతాధికారులకి జిల్లా కలెక్టర్‌పై ఫిర్యాదు చేసారు. 

Related Post