పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై సుప్రీం కీలక ఆదేశాలు

November 30, 2022
img

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై సుప్రీంకోర్టు మంగళవారం కీలకమైన తీర్పు చెప్పింది. మెరిట్ లిస్టు ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైనవారు ఏ కారణం చేతైనా ఉద్యోగాలలో చేరి మానేసినా, చేరకపోయినా ఆ పోస్టులను మెరిట్ లిస్టులో తర్వాత స్థానంలో ఉన్నవారికి కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 

2018, మే 5వ తేదీన నోటిఫికేషన్‌ ప్రకారం పోలీస్ కానిస్టేబిల్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి 2019, సెప్టెంబర్‌ 24న అర్హత సాధించిన అభ్యర్ధుల మెరిట్ లిస్టుని పోలీస్ రిక్రూట్మెంట్‌ బోర్డు ప్రకటించింది. కానీ వారిలో 1,370 మంది వివిద కారణాలతో ఉద్యోగాలలో చేరలేదు. ఆ ఉద్యోగాల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా, మెరిట్ జాబితాలో తర్వాత స్థానంలో అభ్యర్ధులకు కేటాయించకుండా అలాగే ఖాళీగా అట్టేబెట్టేసింది. మెరిట్ జాబితాలో తర్వాత స్థానంలో నిలిచిన అభ్యర్ధులు దీనిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేయగా ఆ పోస్టులలో వారినే నియమించాలని తీర్పు చెప్పింది. 

పోలీస్ రిక్రూట్మెంట్‌ బోర్డు హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయగా దానిపై మంగళవారం విచారణ జరిపి హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ వారినే ఆ ఉద్యోగాలలో నియమించాలని తీర్పు చెపుతూ ఆ పిటిషన్‌ని కొట్టివేసింది. మెరిట్ లిస్టులో తొలిస్థానంలో ఉన్నవారు ఆ ఉద్యోగాలలో చేరకపోతే వాటిని ఖాళీలుగా పరిగణించి వాటిని మెరిట్ లిస్టులో రెండో స్థానంలో ఉన్నవారితో భర్తీ చేయాలని ముంజా ప్రవీణ్ వెర్సస్ తెలంగాణ ప్రభుత్వం కేసులో ఇదివరకే చెప్పిన తీర్పుని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కనుక హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో రెండేళ్ల క్రితం అర్హత సాధించి ఇంతకాలం న్యాయపోరాటం చేసిన 1,370 మంది అభ్యర్ధులకు పోలీస్ కానిస్టేబిల్ ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాదు... పోలీస్ శాఖలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగాల భర్తీకి ఇదే తీర్పు వర్తిస్తుందని భావించవచ్చు.

Related Post