తెలంగాణలో 15,447 ఇంజనీరింగ్ సీట్లు మిగులు

October 25, 2022
img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల ఇంజనీరింగ్ కాలేజీలలో తుదివిడత సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత వివిద కాలేజీలలో కలిపి మొత్తం 15,447 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయని విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిత్తల్ మీడియాకు తెలిపారు. కాలేజీలను ఎంపిక చేసుకొన్న విద్యార్థులందరూ ఈ నెల 28వ తేదీలోగా తమ తమ కాలేజీలలో జాయిన్ అవ్వాలని సూచించారు. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంచడం వలననే ఇన్ని సీట్లు మిగిలిపోయాయా? అనే విలేఖర్ల ప్రశ్నకు ఆయన సమాధానం చెపుతూ, “ఏటా కాస్తా అటూ ఇటూగా కొన్ని సీట్లు మిగిలిపోతూనే ఉంటాయి. ఫీజుల పెంపుకి దీనికి సంబందం లేదు,” అని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 159 ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

 ఇంజనీరింగ్ కాలేజీల స్థాయి, ప్రమాణాలను బట్టి కనీస ఫీజు ఏడాదికి రూ.40,000 నుంచి గరిష్ట ఫీజు రూ.1.60 లక్షలుగా ఖరారు చేసింది. పెంచిన ఈ ఫీజులు మూడేళ్ళపాటు అమలులో ఉంటాయని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులను కూడా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏలకు కనిష్ట ఫీజు రూ.27,000గా ఎంటెక్ కనిష్ట ఫీజు రూ.57,000గా ఖరారు చేసింది.

Related Post